మన దేశంలో లిఖిత సంస్కృతి ప్రారంభమైన నాటినుండి పెళ్లి అతి పవిత్రమైనదిగా పరిగణింపబడుతోంది. మనకున్న సంస్కారాలలో పెళ్లికున్నంత ప్రాముఖ్యత మరి దేనికీ లేదు. వధువును వరుని ఇంటికి తీసుకుపోయే ప్రక్రియనే పెళ్లి అంటారన్నవిషయం అందరికీ తెలిసిందే. సమాజాన్ని సజీవంగా ఈ భూమండలంపై కొనసాగేట్లు చేయడానికి వివాహమే నాంది.
మన సాహిత్యంలో కూడా ఉద్వాహం, ఉపయామం, పరిణయం, పాణిగ్రహణం అను నాలుగు విధాలు పెళ్లికి నామాంతరాలుగా ఉన్నాయి.. ఉద్వాహం అంటే పెండ్లి కుమార్తెను ఆమె తల్లిదండ్రుల ఇంటినుంచి తరలించడం ఉపయామం అంటే స్ర్తిని తీసుకువచ్చి ఒక పురుషునికి భార్యగా చెయ్యడం, పరిణయం అంటే స్ర్తి పురుషులిరువురూ అగ్నిహోత్రానికి ప్రదక్షిణం చేయడం, పాణిగ్రహణం అంటే వరుడు- వధువు కుడి చేతిని తన కుడి చేతితో పట్టుకోవడం అని అర్థాలు.
పెళ్ళి నేను- నాది అనుకునే దశ నుంచి మనం-మనది అనుకునే దశకు దంపతులను నడిపిస్తుంది. ఈ నూతన అనుబంధంతో దంపతులకు సుఖ సంతోషాలు కలుగుతాయి. అలాగే బరువు బాధ్యతలు కూడా వంటబడతాయి. సమాజానికి సూక్ష్మరూపం కుటుంబం అని, ఆ కుటుంబానికి మొదటి మెట్టు పెళ్లి అని పెద్దలు చెప్పారు. పెళ్లితోనే మనిషికి ఎదుగుదల ఉంటుంది. సంతృప్తి, సహకారం, సాంఘిక భద్రత, గౌరవంలాంటివన్నీ పెళ్లివల్లనే కలుగుతాయి.
పెళ్లి అనేది ఒక నియమమని, ఆదర్శమని, సర్వతోముఖ ప్రగతికి కారణమని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. దాంపత్య ధర్మంవల్లనే సంఘ జీవనం ఆరోగ్యప్రదంగా సాగుతుంది. వ్యక్తిగతంగానే గాక వృత్తి సంబంధ పురోగతి సాధించడం కూడా సులభతరమవుతుంది. గృహస్థ ధర్మం గురించి మనం వింటూనే ఉంటాం. గృహస్థ అనే మాట భార్యాభర్తల ఏకత్వానికి సూచిక. ధర్మం, అర్థం, కామం, మోహం అనే నాలుగింటినీ ఆ ఇద్దరూ కలిసే సాధించాల్సి ఉంటుంది. ఇక్కడ ధర్మమంటే మంచి జీవన విధానం. కుటుంబ జీవనం కోసం సంపాదించేదే అర్థం. నీతితో కూడుకున్నదే కామం. చివరికి కష్టనష్టాల నుంచి విముక్తి పొందడమే మోక్షం. సంసారం సజావుగా సాగినంతకాలం భార్యాభర్తలిరువురూ విజేతలే.
అందుకే ‘పురుషుడు’ స్ర్తియెడల నిరంకుశుడు కాడు- స్ర్తి అతనికి బానిస కానేరదు. పెళ్ళయ్యాక భార్యాభర్తలు ఇద్దరూ కూడా తమ తమ ఆశయ లక్ష్యాల ద్వారా ఒక ఆతీత ధర్మానికి సేవకులవలె విధేయతను ప్రకటిస్తూ వుండాలి. కనుక స్ర్తి పురుషుడు సమానులే అన్నారు కొందరుఅన్నారు. ‘పురుషుడు భగవంతుని స్వరూపం అయితే స్ర్తి దేవతా స్వరూపం’ అని అభివర్ణించారు మరికొందరు.
వేదాలను వల్లించడం, మరణించిన పితృదేవతలకు తర్పణాలను అర్పించడం, దేవతలకు అగ్నిలో అర్ఘ్యం మొదలగు వాటిని సమర్పించడం, మనతోకలిసి ఉండే పశుపక్ష్యాదులకు ఆహారాన్ని పెట్టడం, తోటి మానవులను సత్కరించడం అనే పంచమహాయజ్ఞాల్లో స్ర్తి పురుషులు పాల్గొనే అవకాశం పెళ్లి కలుగజేస్తుందని ఋగ్వేదంలో పేర్కొనబడింది. అందుచేతనే ఆశ్రమ ధర్మాలెన్ని ఉన్నా గృహస్థ ఆశ్రమ ధర్మంలో ఏదీ సమానం కాదని భారతీయం చెప్పింది. అంతేగాక వ్యక్తుల సంపూర్ణ అభివృద్ధికి పెళ్లి తోడ్పడుతుంది. గృహస్థులకు భార్య పట్ల కోరికే గాక ధార్మిక ప్రతిపత్తి ప్రబలుతుంది. అటుపిమ్మట వైరాగ్యం అలవడుతుంది. భార్యాభర్తలు ఏకాంతంలో ఒకటి కావడం, సంతానాన్ని కనడం, ధర్మసంస్థాపన చేయడం అను మూడు లక్ష్యాలు పెళ్లి యొక్క పరమావధిగా చెప్పబడ్డాయి. కాబట్టి గృహస్థ ధర్మాన్ని అందరూ బాధ్యతాయుతంగా నిర్వర్తించాలి.
-చోడిశెట్టి శ్రీనివాసరావు

మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి. మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి. ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.

Share